దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లో నేడు సూర్యగ్రహణం ప్రారంభమైన సమయం, విడిచిన సమయాన్ని తెలుసుకునేందుకు సనాతన పద్ధతులను అనుసరించారు గ్రామస్థులు. పలు గ్రామాల్లో రోలులో రోకలి నిలబెడితే, మరికొన్ని ప్రాంతాల్లో పళ్లెంలో సూదిని నిలబెట్టి సునాయాసంగా గ్రహణ గమనాన్ని తెలుసుకున్నారు.
గ్రహణాలు ఎలా ఏర్పడుతాయి.. ఎప్పుడు ఏర్పడుతాయి అని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కనిపెట్టకముందే... భారతీయ పంచాంగాల్లో గ్రహణాలు ఏర్పడే కచ్ఛితమైన తేదీ, సమయాన్ని అంచనా వేశారు మన పూర్వీకులు. అసలు గడియారమే లేని రోజుల్లో గ్రహణం మొదలైన సమయం, ముగిసే సమయాన్ని అంచనా వేసేందుకూ కొన్ని మహోత్తమ పద్ధతులను కనిపెట్టారు. వాటిని ఇప్పుడు అనుసరించి.. విద్యావంతులను సైతం ఔరా అనిపించారు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు.
ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 20 నిమిషాల మధ్య సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. సాధారణంగా పళ్లెంలో నీళ్లు పోసి సూదిని నిలబెట్టాలంటే తలప్రాణం తోకకొస్తుంది. కానీ, గ్రహణం సమయంలో మాత్రం సూదిని ఇలా పెట్టగానే అలా నిటారుగా నిల్చుండిపోయిందని అంటున్నారు.
ఇక రోలుపై రోకలిని నిలబెట్టింది తమిళనాడులోని ధర్మపురి జిల్లా అన్నసాగరంలోని ఓ బాలిక. మరికొందరు నట్టింట్లో పళ్లెం పెట్టి రోకలిని నిలబెట్టారు. ఏ ఆధారం లేకుండా నిలబడినంతసేపు గ్రహణం ఉన్నట్లు స్థానికులు నమ్ముతారు.
కర్ణాటక ధార్వాడ్లోని పలు గ్రామాలతో పాటు చాలా చోట్ల ఇలాంటి అద్భుతాలను ఆసక్తిగా తిలకించారు స్థానికులు. అయితే అయితే అవన్ని వట్టి మాటలే అని కొట్టిపారేసిన వారూ ఉన్నారు.
ఇదీ చూడండి: పశ్చిమాసియాలో గ్రహణం-దుబాయ్లో 'రింగ్ ఆఫ్ ఫైర్'