ఉత్తర్‌ప్రదేశ్‌లో మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు పోలీసులు. ఈ ఘటనపై అతడి కుటుంబసభ్యులు స్పందించారు. తగిన శిక్షే పడిందని పోలీసు చర్యను సమర్థించారు.
వికాస్ దుబే అంత్యక్రియలు కాన్పుర్‌లోని భైరవ్ ఘాట్‌లో నిర్వహించారు. గ్యాంగ్‌స్టర్ భార్య, చిన్న కొడుకు, బావమరిది తప్ప ఇతర కుటుంబసభ్యులు ఎవరూ హాజరుకాలేదు. ఈ సందర్భంగా అతడి భార్య రిచా దుబే 'నా భర్త తప్పు చేశాడు.. ఈ శిక్షకు అర్హుడే' అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. వికాస్ తండ్రిదీ అదే మాట.
"ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు సరైన చర్యే తీసుకున్నారు. నా కుమారుడు ఎనిమిది మంది పోలీసులను చంపేశాడు. ఇది క్షమించరాని నేరం. ముందు నుంచి మా మాట వినుంటే అతడి జీవితం ఇలా ముగిసేది కాదు. మాకు ఏ విధంగానూ అతడు సహకరించలేదు. అతడి కారణంగా మా పూర్వీకుల ఆస్తి నేలమట్టమైంది. ఈ శిక్ష అతడికి సరైనదే. అలా చేయకపోతే రేపు ఇతరులు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తారు."
- రామ్‌కుమార్ దుబే, వికాస్ దుబే తండ్రి
తనను అరెస్టు చేయడానికి వస్తున్న 8 మంది పోలీసులను ఒక పథకం ప్రకారం దారుణంగా కాల్చి చంపించిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను.. శుక్రవారం(జులై 10న) కాన్పుర్ శివార్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చారు.
ఇదీ చూడండి: గ్యాంగ్‌స్టర్ దుబే హతం- అచ్చం సినిమాలానే!