చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం ద్వారానే మహిళా రాజకీయ సాధికారత సాధ్యమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భారత్ మళ్లీ ప్రపంచ అభ్యాస కేంద్రంగా అవతరించే సమయం ఆసన్నమైందన్నారు. దీని కోసం బోధనా పద్ధతులను మార్చాలని సూచించారు.
విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు.. బోధనా పద్ధతులు మార్చి పరిశోధనపై మరింత దృష్టి సారించాలని సూచించారు వెంకయ్య. లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు తగిన రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత సాధ్యమవుతుందని వెంకయ్య తెలిపారు.
మహిళల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి కానీ, ఆర్థిక వృద్ధి కానీ సాధ్యం కాదన్నారు వెంకయ్య. విద్య ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందని, అది సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు.
విద్యార్థుల ఆందోళన
ఏఐసీటీఈ ఆడిటోరియంలో జేఎన్యూ స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో వేలాది మంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. పరిపాలనా విభాగం.. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని నినాదాలతో హోరెత్తించారు.
జేఎన్యూ నుంచి ఏఐసీటీఈ ఆడిటోరియాన్ని చేరుకునేందుకు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. జేఎన్యూ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా వెంకయ్య నాయుడు హాజరైన సమయంలో విద్యార్థులు ఆందోళనకు దిగడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. 'దిల్లీ పోలీస్ గోబ్యాక్' అంటూ నినాదాలు చేశారు విద్యార్థులు.
ఇదీ చూడండి: జేఎన్యూ వద్ద ఉద్రిక్తత.... విద్యార్థులు-పోలీసుల తోపులాట