లక్షద్వీప్, తూర్పు మధ్య అరేబియా సముద్రాన్ని ఆనుకుని నైరుతి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపానుకు మనదేశం సూచించిన ‘వాయు’ పేరు పెట్టారు.
వాయు తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదిలి గుజరాత్ వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, కొంకణ్, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో నేటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 13వ తేదీకి ఇది తీవ్ర తుపానుగా మారి గుజరాత్ పోర్బందర్- మహువా మధ్య తీరం దాటుతుందని ఐఎమ్‌డీ అంచనా వేసింది.
తీరం దాటే సమంయలో గంటకు 120- 135 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ వాయు తుపాను ప్రభావం ముంబై నగరంపైనా తీవ్రంగానే ఉండనుంది. సౌరాష్ట్ర, కుచ్ తీర ప్రాంతాల్లో జూన్ 13, 14 రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ హెచ్చరించింది.
ఇప్పటికే తీర ప్రాంత వాసులకు, మత్స్యకారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సౌరాష్ట్ర, కుచ్ తీర ప్రాంతాల్లో మోహరించింది.
- ఇదీ చూడండి: కశ్మీరులో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం