దిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హ్యాపీనెస్ పాఠ్యప్రణాళిక తననెంతో ఆకట్టుకుందని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా.. దిల్లీ మోతీబాగ్లోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలను సందర్శించారు.
మెలానియాకు సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు ప్రత్యేక స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు.
చిన్నారులతో మాటామంతీ..
కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'క్లాస్ ఆఫ్ హ్యాపీనెస్' గురించి స్వయంగా తెలుసుకున్నారు మెలానియా. తరగతి గదిలోకి వెళ్లి పిల్లలకు బోధించే విధానాన్ని పరిశీలించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. వ్యాయామ తరగతులను వీక్షించారు. అక్కడి వాతావరణం, బోధన పద్ధతులు బాగున్నాయని చెప్పారు మెలానియా.
"నమస్తే.. సంప్రదాయ దుస్తుల్లో అద్భుత నృత్యాలతో మీరు ఇచ్చిన సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. ఇది భారత్లో నా మొదటి పర్యటన. ఈ దేశానికి అతిథులుగా రావటం అమెరికా అధ్యక్షుడికి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి హ్యాపీనెస్ పాఠ్యప్రణాళిక నాకు నచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరవుతూ విద్యార్థులు రోజును ప్రారంభిస్తున్నారు. ఉపాధ్యాయుల బోధన విధానం, విద్యార్థుల ఆసక్తి స్ఫూర్తినిచ్చాయి. "
-మెలానియా ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ
మెలానియా సందర్శన కోసం పాఠశాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సంతోషంగా ఉంది: కేజ్రీవాల్
మెలానియా తమ ప్రభుత్వ పాఠశాలను సందర్శించడంపై హర్షం వ్యక్తంచేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. శతాబ్దాలుగా ప్రపంచానికి భారత్ ఆధ్యాత్మికతను బోధించిందని.... తమ పాఠశాల నుంచి ఆనందానికి సంబంధించిన సందేశాన్ని స్వీకరించేందుకు మెలానియా రావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
కేజ్రీవాల్ ఆలోచన నచ్చి..
2018లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 'క్లాస్ ఆఫ్ హ్యాపినెస్'ను ప్రవేశపెట్టింది. నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనేలా.. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది.
'క్లాస్ ఆఫ్ హ్యాపీనెస్'లో చిన్నారి మనసులను సానుకూల దృక్పథంతో నింపి.. ఆనందమైన జీవితంపైపు అడుగులు వేయిస్తున్నారు ఉపాధ్యాయులు. విద్యార్థుల్లో ఒత్తిడి తీసేసి, ఆసక్తికరమైన కథలు చెప్పి వారిలో విలువలు పెంచే దిశగా కదం తొక్కుతున్నారు.