కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే, ఈ లాక్డౌన్ అమెరికా దంపతలకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఓ చిన్నారిని దత్తత తీసుకునేందుకు భారత్కు వచ్చిన మైక్, విట్నీ సవిల్లే... తిరిగి ఇంటికెళ్లే దారి లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
జార్జియాకు చెందిన మైక్, విట్నీ కాలేజీలోనే ప్రేమలో పడ్డారు. ఎప్పటికైనా ఓ అనాథను దత్తత తీసుకుని, మంచి జీవితాన్నివ్వాలనేది వారిద్దరి కల. పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టాక వారి కలను సాకారం చేసుకునేందుకు భారత్కు వచ్చారు. ఓ బాలికను దత్తత తీసుకుని గ్రేస్ అని నామకరణం చేశారు. కానీ, కరోనా వారికి అడ్డంకైంది.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారతప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిపివేయగా.. కొత్త కుమార్తెతో కలిసి హోటల్ గదిలోనే కాలం వెళ్లదీస్తున్నారు మైక్, విట్నీ. తమ బాధను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా తమను ఇంటికి చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
"మేము మార్చ్ 5న జార్జియా నుంచి బయలుదేరాము. మార్చ్ 6న ఇక్కడికి చేరుకున్నాము. కొన్ని రోజుల తరువాత మేము మా కుమార్తెను పూర్తిగా మా ఇంటికి తీసుకెళ్తాం. ఇక్కడ కొన్ని దత్తత ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా, గ్రేస్ పేరిట పాస్పోర్ట్, వీసా రావాలి. కానీ, కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు జరిగాయి. లాక్డౌన్ కారణంగా మా కుమార్తె భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. గ్రేస్తో మేమూ ఉన్నాము కాబట్టి సంతోషంగానే ఉంది. కానీ, పరిస్థితులు కాస్త మారితే ఇంకా బాగుంటుంది. మమ్మల్ని మా ఇంటికి చేర్చడానికి ఎవరైనా ముందుకు రావాలని కోరుతున్నా."
-విట్నీ సవిల్లే
మైక్, విట్నీలతో పాటు, అదే హోటల్లో చిక్కుకున్న మరో రెండు కుటుంబాలను స్వదేశాలకు చేర్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దిల్లీలోని దౌత్య కార్యాలయంతో కలిసి పని చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు జార్జియా సెనెటర్ డేవిడ్ పెర్డ్యూ.