ముంబయిలో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశకు నామినేషన్లు జోరందుకున్నాయి. సినీనటి ఊర్మిళా మాతోంద్కర్ కాంగ్రెస్ తరఫున 'ఉత్తర ముంబయి' నుంచి నామపత్రం దాఖలు చేశారు. భాజపా అభ్యర్థి గోపాల్ శెట్టిపై ఎన్నికల బరిలో దిగారు ఆమె. నామినేషన్ అనంతరం అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఊర్మిళ.
సంజయ్‌దత్ సోదరి ప్రియాదత్ కాంగ్రెస్ తరఫున 'ముంబయి నార్త్ సెంట్రల్' నుంచి నామపత్రాలు దాఖలు చేశారు. భాజపా అభ్యర్థి పూనమ్ మహాజన్ ఈస్థానం నుంచి ప్రియపై పోటీ చేస్తున్నారు. నామపత్రాలు సమర్పించేందుకు సోదరికి తోడుగా వెళ్లాడు సంజయ్‌దత్.
కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్(వాయవ్య ముంబయి), శివసేన అభ్యర్థి రాహుల్ షేవాలా(దక్షిణ మధ్య ముంబయి) తో పాటు మరికొందరు నేతలు నామినేషన్లు సమర్పించారు.
నామపత్రాలను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 11 చివరి తేదీ.
నాలుగు దశల్లో పోలింగ్
మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడత(ఏప్రిల్ 11)లో 7 , రెండో విడత(ఏప్రిల్ 18)లో 10 , మూడో విడత(ఏప్రిల్23)లో 14, నాలుగో విడత(ఏప్రిల్ 29)లో మిగతా 17 స్థానాలకు పోలింగ్ జరగనుంది.