పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత రణరంగం మారిన అసోంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తూ పలు వర్గాలు, ప్రజలు ఆందోళనలను కొనసాగిస్తున్నారు.
అట్టుడికిన అసోం...
తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న రాజధాని గువాహటి సహా అసోంలోని 10 జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ, మరో 4జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులు అనేక ప్రాంతాల్లో వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించారు. అసోం మంత్రి రంజిత్‌దత్తా, భాజపా ఎమ్మెల్యే పద్మా హజారికా ఇళ్లపై నిరసనకారులు దాడికి దిగారు.
రణరంగంగా గువాహటి...
గోలాఘాట్, దిబూర్‌ఘర్, సదియా, తేజ్‌పుర్‌లో ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై దాడి చేశారు. పలు ప్రాంతాల్లో టైర్లను కాల్చి రహదారులను దిగ్బంధించారు. తమపై రాళ్ల దాడికి దిగిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు గువాహటిలోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు కాల్పులు జరపగా.. .ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో మరో 11 మంది గాయపడ్డారు. గువాహటిలో అడుగడుగునా సైన్యం, పారామిలటరీ దళాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు.
నిషేధాజ్ఞలు...
హింసాత్మక ఘటనల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు వ్యాప్తి చేయకుండా అసోంలోని 10 జిల్లాల్లో 48 గంటల పాటు అంతర్జాల సేవలపై నిషేధం విధించారు. అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ సొంత ప్రాంతం దిబూర్‌ఘర్‌చౌబాలో ఆందోళన కారులు రైల్వే స్టేషన్‌కు నిప్పంటించిన నేపథ్యంలో గువాహటి నుంచి నడిచే అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. రైళ్ల రద్దు నేపథ్యంలో గువాహటిలోని పలు స్టేషన్లలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రత్యేక రైలు ద్వారా వారిని స్వస్ధలాలకు చేరుస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో గువాహటికి రాకపోకలు సాగించే పలు విమానాలను రద్దు చేయగా, మరికొన్ని సర్వీసుల సమయాలను మార్చారు.
మోదీ విజ్ఞప్తి...
ప్రజలు శాంతించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్‌లో అసోం, ఆంగ్ల భాషల్లో ఈ ఆందోళనలపై స్పందించిన ప్రధాని.. కేంద్ర ప్రభుత్వం, వ్యక్తిగతంగా తాను అసోం ప్రజల రాజకీయ, భాష, సాంస్కృతిక, భూమి హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ బద్ధంగా కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై అసోం ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రధాని హామీ తర్వాత కూడా అసోంలో ఆందోళనలు కొనసాగాయి.
మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లో హింసాయుత ఘటనలు చోటు చేసుకోగా, రెండు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. మొబైల్ అంతర్జాల సేవలపై 48 గంటల పాటు నిషేధం విధించారు.
త్రిపురలో బంద్...
త్రిపురలో తీవ్ర హింస చోటు చేసుకోకున్నా....రాజధాని అగర్తలాలో బంద్ పాటించారు. అటు పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ త్రిపుర ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్, త్రిపుర పీపుల్స్ ఫ్రంట్, సహా త్రిపుర రాజవంశానికి చెందిన కుటుంబ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. బిల్లుపై వారి అభ్యంతరాలను పరిష్కరిస్తామని అమిత్‌షా హామీ ఇవ్వడం వల్ల నిరవధిక సమ్మెను విరమించుకున్నట్లు తెలిపారు.