దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ షాద్‌నగర్ విషాదం నుంచి తేరుకోకముందే ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. తమపై ఫిర్యాదు చేసిందన్న అక్కసుతో ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి ఐదుగురు దుండగులు నిప్పంటించారు. మార్చిలో ఆమెపై అత్యాచారం చేసి, బెయిల్‌పై విడుదలైన నిందితుడు దాడికి యత్నించాడు. ప్రస్తుతం ఈ దుశ్చర్యకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శరీరం కాలుతున్నా..112కు ఫోన్
దాడి జరిగిన క్రమంలో బాధితురాలు తనను తాను కాపాడుకునేందుకు మంటల్లోనే కిలోమీటరు దూరం పరిగెత్తింది. శరీరం కాలిపోతున్నా.. ధైర్యం కూడగట్టుకుని 112 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు చెప్పింది. బాధితురాలు ఫోన్‌తోనే అంబులెన్స్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
పరిస్థితి విషమం..
బిహార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింధ్పుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి శరీరం పూర్తిగా కాలిపోయింది. అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆమెను మెరుగైన వైద్యం కోసం లఖ్‌నవూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
కోర్టుకు వెళుతుండగా..
బాధితురాలి వాంగ్మూలాన్ని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దయశంకర్ పతక్ ముందు నమోదు చేశారు పోలీసులు. తమ గ్రామం నుంచి రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళుతున్న క్రమంలో తనపై దాడి జరిగినట్లు బాధితురాలు వెల్లడించింది. తన నివాసానికి సమీపంలోని గౌర మలుపు వద్దకు చేరుకోగానే హరిశంకర్ త్రివేది, రామ్ కిశోర్ త్రివేది, ఉమేశ్ బాజ్పేయీ, శివం త్రివేది, శుభం త్రివేదిలు తనకు నిప్పు పెట్టినట్లు పేర్కొంది. శివం, శుభం త్రివేదీలు 2018 డిసెంబర్లో తనను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఆ క్రమంలోనే మార్చిలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
నివేదికకు ముఖ్యమంత్రి ఆదేశం...
దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరి దృష్టినీ ఆకర్షించిన ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లి పూర్తిస్థాయి నివేదికను సాయంత్రంలోపు అందించాలని పోలీసులు, అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్యం అందించాలని.. దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
యోగి ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు...
ఉన్నావ్ బాధితురాలిపై దాడి జరిగిన క్రమంలో యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లో రోజురోజుకూ ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఇప్పటికైనా భాజపా ప్రభుత్వం కళ్లుతెరవాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.
"ఉత్తర్‌ప్రదేశ్‌లో చట్టాలు చాలా బాగా పనిచేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తరచూ అసత్యాలు చెబుతున్నారు. కానీ ఆడవారిపై రోజూ జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే గుండె రగిలిపోతోంది. ఇప్పటికైనా భాజపా నాయకులు కళ్లు తెరవాలి."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి.
" ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. డీజీపీ రాజీనామా చేయాలి."
-అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత.
మహిళా కమిషన్ లేఖ..
ఘటనపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖ శర్మ.. యూపీ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌కు లేఖ రాశారు. గత మూడేళ్లలో జరిగిన అత్యాచార ఘటనలు, తీసుకున్న చర్యలు, ఇలాంటి ఘటనల్లో బెయిల్ మంజూరు చేసిన సందర్భాలు వంటి అంశాలతో పూర్తి నివేదిక అందించాలని స్పష్టం చేశారు.