వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగే శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది కాంగ్రెస్. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ప్రజల్లో శక్తిమంతమైన నేతగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా... ఆమె రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ సాగే క్యాలెండర్‌ను ఆవిష్కరించింది. ప్రజా సమస్యలపై ప్రియాంక గాంధీ స్పందన, పోరాటాలకు సంబంధించిన ఫొటోలను ఇందులో పొందుపరిచింది.
యూపీవ్యాప్తంగా 10లక్షల క్యాలెండర్లు పంచనుంది కాంగ్రెస్. ప్రతి వార్డు, గ్రామానికి వీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు అధిష్ఠానం సూచించింది. జనాభా ప్రాతిపదికన ప్రతి జిల్లాకు క్యాలెండర్ల పంపిణీ ప్రారంభించారు.
12 పేజీల క్యాలెండర్లో తొలి పేజీలో సోన్‌భద్రలోని ఉంభా నరమేధ బాధిత ఆదివాసి మహిళలను ప్రియాంక ఓదార్చుతున్న ఫొటో ఉంది.
హాథ్రస్ బాధితురాలి తల్లిని హత్తుకోవడం, పార్టీ కార్యకర్తలను పోలీసుల లాఠీఛార్జ్ నుంచి కాపాడడానికి యత్నించిన్పటి ఫొటోలను క్యాలెండర్లో పెట్టారు.
ఆజంగఢ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో ఇబ్బందులపాలైన వారిని కలవడం, బాధిత కుటంబానికి చెందిన ఓ చిన్నారి కన్నీళ్లను ప్రియాంక తుడిచిన ఫొటోలు ఉన్నాయి. అమేఠీ, రాయ్‌బరేలీ, హరియాణా, ఝార్ఖండ్ వెళ్లిన నాటి ఫొటోలూ పొందుపరిచారు.
ఇదీ చూడండి: 'ఈ మాటలతో ఇక మహిళకు రక్షణ ఉంటుందా?'