దేశవ్యాప్తంగా యోగా వేడుకలు అంబరాన్నంటాయి. దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఝార్ఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు, ఔత్సాహికులు యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా ఆసనాలు వేశారు.
రాష్ట్రపతి భవన్లో కోవింద్...
దిల్లీ రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో నిర్వహించిన యోగా వేడుకలకు హాజరయ్యారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. రాష్ట్రపతి భవన్లో యోగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు కోవింద్. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎర్రకోట ముందు ఉపరాష్ట్రపతి...
ఎర్రకోట ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ఉత్సాహవంతులు పాల్గొని.. ఆసనాలు వేశారు.
జీవితంలో భాగంగా: మోదీ
ఝార్ఖండ్ రాంచీలోని ప్రభాత్ తారా మైదానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 40 వేల మంది ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ప్రజలను కోరారు మోదీ. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అవసరమని ప్రసంగించారు ప్రధాని.
రోహ్తక్లో అమిత్ షా...
హరియాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో రోహ్తక్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ముఖ్యమంత్రి ఖట్టర్‌తో కలిసి ఆసనాలు చేశారు.
దిల్లీలో కేంద్ర మంత్రులు...
దిల్లీలో కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు వేర్వేరు వేదికల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్‌పథ్ మొదలు ఎర్ర కోట, ఉద్యానవనాలు, ఆసుపత్రులు, పచ్చిక బయళ్లు, కార్యాలయాలు అన్నింటా యోగా సందడి నెలకొంది. వేలాది మంది ఔత్సాహికులు ఆసనాలు వేస్తూ కనిపించారు.
రాజ్‌నాథ్ సింగ్, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్, భాజపా నేత మీనాక్షి లేఖి తదితరులు రాజ్‌పథ్‌లో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు.
భద్రతను దృష్టిలో ఉంచుకొని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం నుంచే దిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దీన్ దయాల్ మార్గ్‌లో భాజపా..
దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని భాజపా ప్రధాన కార్యక్రమంలో యోగా కార్యక్రమం నిర్వహించారు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ. నడ్డా. పార్టీ ప్రముఖ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు.
రవిశంకర్ ప్రసాద్.. హౌజ్ ఖాస్, పీయూష్ గోయల్.. లోధి గార్డెన్, హర్ష వర్ధన్... కుదేసియా గార్డెన్, స్మృతి ఇరానీ... దాదా దేవ్ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇతర కేంద్ర మంత్రులు వారి వారి కార్యాలయాల ముందు యోగా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
దౌత్య కార్యాలయాల్లో..
దిల్లీలోని అమెరికా, ఫ్రాన్స్ దౌత్య కార్యాలయాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. విదేశీయులూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
నాందేడ్‌లో బాబా రాందేవ్...
యోగా కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించింది మహారాష్ట్ర ప్రభుత్వం. యోగా గురువు రాందేవ్ బాబా, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్లు నాందేడ్‌లో ఆసనాలు వేశారు. వేలాది మందితో యోగాసనాలు వేయించి, వాటి ప్రాధాన్యత వివరించారు రాందేవ్.
గడ్డకట్టే చలిలో ఐటీబీపీ...
ఇండో-టిబెటన్ సరిహద్దు దళం జవాన్లు యోగా నిర్వహించారు. జమ్ముకశ్మీర్ ఉత్తర లద్దాఖ్‌లో 18 వేల అడుగుల ఎత్తులో మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ చలిలో ఆసనాలు వేశారు.
జాగిలాల యోగా...
జమ్ముకశ్మీర్‌లో సరిహద్దు భద్రతా దళ డాగ్‌స్క్వాడ్ బృందం జాగిలాలకు యోగా శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. పోలీసులతో కలిసి జాగిలాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
అశ్వాలపై...
ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత సైన్యం వినూత్న పద్ధతిలో వేడుకలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ సహారన్‌పుర్‌లో అశ్వాలపై యోగాసనాలు వేసిన సైనికులు అరుదైన ఘనత సాధించారు.