కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. ప్రాణాలను లెక్క చేయకుండా రోగులకు చికిత్స అందిస్తున్నప్పటికీ.. కొన్నిచోట్ల వైద్యులపై దాడులు జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ప్రతినిధులు, పలువురు వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు కేంద్ర మంత్రి. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విశేష కృషి చేస్తున్న వైద్యులకు, వైద్య బృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు.
వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులకు నిరసనగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విరమించుకోవాలని ఐఎంఏ ప్రతినిధుల్ని కోరారు అమిత్షా. కాసేపటికే అందుకు అంగీకరిస్తూ ప్రకటన చేశారు ఐఎంఏ ప్రతినిధులు.