కేంద్ర మంత్రివర్గాన్ని మరో నెలరోజుల్లో విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబరు రెండో వారం తర్వాత కొన్ని రోజుల పాటు మంచి ముహూర్తాలు లేకపోవడం వల్ల ఈ లోగానే పునర్వ్యవస్థీకరణ, కొత్తవారికి అవకాశం కల్పించడం వంటివి పూర్తి చేయవచ్చని తెలుస్తోంది. బిహార్ అసెంబ్లీ సమరంతో పాటు 10 రాష్ట్రాల్లోని 54 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు ఇటీవల పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర కేబినెట్ విస్తరణపై పడింది. వివిధ రాష్ట్రాలకు పార్టీ బాధ్యుల్ని నియమించే సంస్థాగత ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. పార్టీ నేతలకు బాధ్యతల అప్పగింత పూర్తయినందువల్ల ఇప్పుడు కేబినెట్ విస్తరణే మిగిలింది. ప్రాంతీయ ఆకాంక్షల్ని, 2021లో జరగబోయే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. ఖాళీలను భర్తీ చేయడం, చక్కని పనితీరు కనపరుస్తున్నవారిని ప్రోత్సహించడం, సంకీర్ణంలో ఉన్న మిత్రులను భాజపా పెద్దగా పట్టించుకోవట్లేదనే అభిప్రాయాన్ని దూరం చేయడం వంటివి లక్ష్యంగా విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు.
మరో 26 మంది వరకు అవకాశం
ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టి దాదాపు ఒకటిన్నరేళ్లు కావస్తోంది. చట్టప్రకారం 79 మందిని మంత్రులుగా నియమించుకునేందుకు అవకాశమున్నా ప్రస్తుతం 53 మందే ఉన్నారు. మరో 26 మందికి అవకాశం ఉంది.
- లోక్ జనశక్తి (ఎల్‌జేపీ) పార్టీ వ్యవస్థాపకుడు రాంవిలాస్ పాసవాన్, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి ఇటీవల కన్నుమూశారు. శివసేన, శిరోమణి అకాలీదళ్ మంత్రులు ఎన్డీఏ నుంచి వెలుపలకు వచ్చి రాజీనామాలు చేశారు. దీంతో వారి శాఖల భారం పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జావడేకర్‌లపై పడింది.
- కేబినెట్‌లో ఖాళీలను భర్తీ చేసేటప్పుడు బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, ఇటీవల భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా వంటివారికి అవకాశం లభించవచ్చని ప్రముఖంగా వినిపిస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని కూడగట్టడంలో బిహార్ ఆర్థిక మంత్రిగా సుశీల్‌మోదీ కనపరిచిన అసాధారణ పనితీరుతో ఆయన్ని కేంద్ర ఆర్థిక శాఖలో సహాయ మంత్రిగా తీసుకోవాలని భాజపా కేంద్ర నాయకత్వం భావిస్తోంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారును కూల్చడంలోనే కాకుండా ఇటీవల అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో 28 స్థానాలకు గానూ 19 చోట్ల నెగ్గడంలో కీలకంగా వ్యవహరించినందుకు సింధియాకు కేబినెట్ ర్యాంకు ఇవ్వొచ్చని తెలుస్తోంది.
- ప్రస్తుత కేబినెట్‌లో ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి రాందాస్ అఠవాలె ఒక్కరి ప్రాతినిథ్యమే ఉంది. ఈ పరిస్థితుల్లో జేడీ(యూ) నుంచి ఒకరికే అవకాశం లభించవచ్చు. బిహార్‌కు సంబంధించి మరో ఆసక్తికర ఊహాగానం కూడా వినిపిస్తోంది. ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ ఆ రాష్ట్రంలో కనీసం 26 అసెంబ్లీ స్థానాల్లో జేడీ(యూ)ను ఓడించడానికి తోడ్పడడం వల్ల దానికి ప్రతిఫలంగా ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. జేడీయూ కంటే భాజపా ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంలో చిరాగ్ పాత్ర కీలకంగా చెబుతున్నారు.
ఎన్నికల దృష్టితో ఎంపికలు
పశ్చిమ బెంగాల్, అసోంలకు చెందిన కొందరు భాజపా ఎంపీలకూ కేబినెట్ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌కు చెందిన ఎల్.ఛటర్జీ, రూపా గంగూలీ, ఎస్.ఎస్.ఆహ్లూవాలియా వంటివారిలో ఎవరో ఒకరిని తీసుకునే వీలుంది. అసోం నుంచి ఒకరికి అవకాశం లభించవచ్చు.
- ఛత్తీస్‌గఢ్‌లో భాజపా దిగ్గజ నేత సరోజ్ పాండేకు మంత్రివర్గంలో బెర్తు ఖాయం కావచ్చని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ పనితీరు నామమాత్రంగా ఉండడం వల్లే ఆ రాష్ట్రంలో నవతరం నాయకులను ప్రోత్సహించి, భాజపా సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని కమలనాథులు యోచిస్తున్నారు.
ఇదీ చూడండి: పట్టపగ్గాల్లేని నేర రాజకీయం- ఈసీ బాధ్యతేంటి?