కరోనా లాక్‌డౌన్ దేశంలోని వీధి బాలలపై బాగా ప్రభావితం చూపుతోంది. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లల ఆరోగ్యం, పోషణ, చదువులతో పాటు వారి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింటోంది. వీరి సంక్షేమంపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ దృష్టి సారించింది.
4 కోట్ల మంది వీధి బాలల కోసం...
యూనిసెఫ్ అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 4 కోట్ల మంది వీధిబాలలు ఉండగా, ఒక్క దిల్లీలోనే కనీసం 70 వేల మంది వరకు ఉన్నారు. దీనిపై యూనిసెఫ్ భారతదేశ ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ ఆలీ హక్ ‘ఈటీవీ భారత్’తో మాట్లాడుతూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎవరి అండదండలు లేని పిల్లలను గుర్తిస్తున్నట్టు తెలిపారు. వారికి తగిన రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వీధిబాలల్లో కొంతమంది అవగాహన ఉన్నవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి భోజన సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ఇలాంటి వారి నుంచి దాదాపు మూడు లక్షల ఫోన్‌కాల్స్ రావడం గమనార్హం. వీరిలో కొందరు విద్యార్థులు కావడం, పాఠశాలలు మూతపడడంతో దిక్కుతోచని స్థితిలో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని డాక్టర్ హక్ చెప్పారు.
అందరి సహకారంతో..
బాలల సంక్షేమ, సంరక్షణ అధికారులు, పోలీసులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీధిబాలల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో దాదాపు 16వేల మంది శిశు సంక్షేమ అధికారులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇచ్చామని చెప్పారు. వీధి బాలలతో పాటు, వలస వెళ్లిన కూలీల పిల్లలు, క్వారంటైన్‌లో ఉన్నవారి పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. మానసిక ఒత్తిడిలోనయిన పిల్లలకు నిమ్‌హాన్స్ సంస్థ సహకారంతో తగిన సహకారం అందిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: 7 రాష్ట్రాల్లో వెయ్యి దాటిన కరోనా కేసులు