చైనా కమ్యూనిస్టు పార్టీతో 2008లో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందని, దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో సమగ్ర విచారణ జరిపించాలంటూ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కావాలంటే హైకోర్టును ఆశ్రయించుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది. ‘‘మీరు కోరుతున్న ఊరటలు హైకోర్టు ఇవ్వొచ్చేమో’’అని పిల్‌ను తిరస్కరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
అంతకు ముందు పిటిషనర్లు శశాంక్ ఝా, రోడ్రిగ్స్ తరఫున న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తూ.. చైనాలోని ఏకైక పార్టీతో కాంగ్రెస్ ఒప్పందం చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. దేశ భద్రతతో ముడిపడిన అంశంగా దీన్ని కోర్టు పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"ప్రభుత్వంతో కాకుండా, ఒక పార్టీతో చైనా ఒప్పందం చేసుకుందని మీరు చెబుతున్నారు. మా పరిమిత అనుభవంలో మేం ఎప్పుడూ ఇలాంటి విషయాన్ని వినలేదు, చట్టం దృష్టిలో కూడా ఇదో అసంగతమైన విషయం"
-ధర్మాసనం
అయినా జెఠ్మలానీ తన వాదనలు కొనసాగించారు. దీంతో పిల్ ఉపసంహరించుకుని కొత్తగా పిటిషన్ వేయాల్సిందిగా కోర్టు సూచించింది. కొత్త పిటిషన్లో తప్పుడు సమాచారం ఉంటే మిమ్మల్నే విచారించాల్సి ఉంటుందని జెఠ్మలానీని ధర్మాసనం హెచ్చరించింది.
మాకే అనుకూలం.. కాదు మాకే
సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై భాజపా, కాంగ్రెస్ పరస్పరారోపణలు చేసుకున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందాన్ని చూసి సుప్రీం కోర్టే ఆశ్చర్యపోయిందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అంటే కోర్టు వ్యాఖ్యలను భాజపా వక్రీకరించిందని కాంగ్రెస్ మండిపడింది.