ఉద్యోగం కోసం కన్న తండ్రినే కడతేర్చిన దారుణ ఘటన ఝార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లాలో జరిగింది. బార్కానాలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్)లో హెడ్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న క్రిష్ణ రామ్ అనే వ్యక్తి గురువారం రాత్రి తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు.
పదునైన చాకుతో ఆయన గొంతులో పొడిచి చంపినట్లు పోలీసులు అనుమానించారు. విచారణ చేపట్టిన పోలీసులు, ఆయన పెద్ద కుమారుడే ఈ హత్యకు పాల్పడ్డట్లు దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న ఆ యువకుడు, తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగం పొందవచ్చనే ఆశతోనే ఈ దారుణానికి పాల్పడ్డట్లు విచారణలో తేల్చారు. ఈ నేరం తానే చేసినట్లు క్రిష్ణ పెద్ద కుమారుడు ఒప్పుకున్నాడని పోలీసు ఉన్నతాధికారి ప్రకాశ్ చంద్ర మహతో వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సీసీఎల్ సంస్థ నిబంధనల ప్రకారం, సంస్థకు చెందిన వారు ఎవరైనా ఉద్యోగం చేస్తూ మరణిస్తే, కారుణ్య నియామకం కింద అతనిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది.