ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం.. కరోనా సంక్షోభం, చైనాతో సరిహద్దు వివాదమనే యుద్ధాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు షా. ప్రతి విషయంలోనూ కొందరు తప్పులు వెతుకుతారని ఆరోపించారు.
"ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. కరోనా సంక్షోభం, వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుంది. కానీ కొందరు ప్రతి విషయాన్ని తప్పుగా చూస్తారు. దేశానికి వ్యతిరేకంగా చేసే ప్రచారాలను మేము సమర్థవంతంగా అడ్డుకోగలం. కానీ ఓ పెద్ద పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు (రాహుల్ గాంధీ).. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ రాజకీయాలు చేయడం ఎంతో బాధాకరం. ఆ పార్టీ చేస్తున్న 'సరెండర్ మోదీ' హ్యాష్‌ట్యాగ్‌కు పాకిస్థాన్, చైనా మద్దతు పలుకుతున్నాయి. ఈ విషయంపై ఆయన, ఆయన పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి."
-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
కరోనా వైరస్ సంక్షోభం, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంలో మోదీ తీరుపై రాహుల్ గాంధీ అనేకమార్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దులో ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ భయపడకుండా ప్రజల ముందుకొచ్చి.. నిజం చెప్పాలన్నారు రాహుల్.
ఇదీ చూడండి:- పీవోకేలో చైనా విమానాలు.. భారత్‌కు వ్యతిరేకంగా కుట్ర