భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉమాభారతి కేంద్ర నీటి వనరులు, నదుల అభివృద్ధి మంత్రి ఉమాభారతికి భారతీయ జనతా పార్టీలో ఉన్నత పదవి దక్కింది. ఆమెను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు ఉమాభారతి. ఈ నేపథ్యంలో భాజపా అధిష్టానం ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉమాభారతి. హిందుత్వ నాయకురాలైన ఆమె 18 నెలలు తీర్థయాత్రలకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీలో చురుకుగా పాల్గొంటారు ఉమా భారతి. 2003 డిసెంబర్ నుంచి 2004 ఆగస్టు వరకు మధ్యప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ఆమె సేవలందిచారు.