కేరళలో కొచ్చి విమానాశ్రయంలో రన్‌వేపై దుబాయ్ బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న విమానాన్ని అకస్మాత్తుగా నిలిపివేశారు అధికారులు. విమానంలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఉన్న కారణంగా 289 మంది ప్రయాణికులను కిందకు దింపేశారు. వారిలో 19 మందిని మాత్రమే ప్రత్యేక శిబిరానికి తరలించి, మిగిలిన వారిని దుబాయ్‌కు పంపించేశారు.
ఇదీ జరిగింది..
బ్రిటన్‌కు చెందిన 19 మంది బృందం కేరళకు విహారయాత్ర కోసం వచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని కేరళ మున్నార్‌లోని రిసార్ట్ నిర్బంధ కేంద్రంలో ఉంచారు అధికారులు. శనివారం రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షలకు పంపారు. నేడు బయటపడిన ఫలితాల్లో వారిలోని ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. అయితే అధికారుల అనుమతి లేకుండానే వారు దుబాయ్ వెళ్లే విమానాన్ని ఎక్కేశారు. బ్రిటన్ పర్యటకులు ప్రత్యేక శిబిరాన్ని వీడిన అంశాన్ని గుర్తించిన అధికారులు విమానాశ్రయ సిబ్బందిని సంప్రదించారు. దుబాయ్‌కు బయల్దేరనున్న విమానంలో వారు ఉన్నట్లు తెలుసుకుని ఆపేసి.. ప్రత్యేక శిబిరానికి తరలించారు.