మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలో కొలువుతీరిన 'మహా వికాస్ అఘాడీ' కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. బలపరీక్ష కోసం మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కాగా, బహిరంగ ఓటింగ్ నిర్వహించారు. 288 మంది సభ్యులు గల మహారాష్ట్ర శాసనసభలో మెజార్టీ నిరూపణకు 144 మంది సభ్యుల బలం అవసరం కాగా... మూడు పార్టీల కూటమి 169 ఓట్లు సాధించింది.
బల పరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు కాంగ్రెస్ నేత అశోక్ చవాన్. ప్రభుత్వాన్ని శివసేన నేత సునీల్ ప్రభు, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ బలపరిచారు. ఈ క్రమంలో ప్రోటెం స్పీకర్ దిలీప్ వాల్‌సే పాటిల్ ఓటింగ్ నిర్వహించారు.
సర్కార్‌కు మద్దతుగా 169 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఓటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యేలను లెక్కించారు స్పీకర్. అనంతరం పరీక్షలో ప్రభుత్వం నెగ్గినట్లు ప్రకటించారు. బల పరీక్షలో ఏ పార్టీకీ మద్దతుగా నిలవకుండా.. నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు.
భాజపా సభ్యులు లేకుండానే మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించారు.
భాజపా వాకౌట్..
బల పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టిన క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సభను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆయనతో పాటు భాజపా నేతలంతా సభనుంచి వాకౌట్ చేశారు. వందేమాతరం పాడకుండానే సభ ప్రారంభించడమేంటని ప్రశ్నించారు ఫడణవీస్. ఎన్సీపీ నేత దిలీప్ వాల్‌సేను ప్రోటెం స్పీకర్గా ఎన్నుకోవటాన్ని తప్పుపట్టారు.
ఇదీ చూడండి: 'మహా 'ఉపముఖ్యమంత్రి'పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు'