మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయనికి వెళ్లిన ఆయన సీఎం కార్యాలయం ఉన్న ఆరో అంతస్తుకు చేరుకుని ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు.
నివాళులతో మొదలు
ఠాక్రేల నివాసం మాతోశ్రీ నుంచి బయల్దేరిన ఉద్ధవ్ ముందుగా హుతాత్మ చౌక్‌లోని అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకుని ఛత్రపతి శివాజీకి నివాళులు అర్పించారు. అనంతరం ఆరో అంతస్తులోని ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రే అనే నామఫలకం ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని సీఎం పీఠంపై ఆసీనులయ్యారు.
రేపే బలపరీక్ష
మహారాష్ట్ర శాసనసభలో శనివారం బలపరీక్ష జరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ బలనిరూపణ కోసం డిసెంబర్ 3 వరకు సమయమిచ్చారు. అయితే శనివారమే విశ్వాస పరీక్ష జరగనుందని శాసనసభ వర్గాలు వెల్లడించాయి.
'అఘాడీని ఏమీ చేయలేం'
ఎన్నికల అనంతరం మహా కూటమి ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది సుప్రీంకోర్టు. అఖిల భారత హిందూ మహాసభ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం... ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల పొత్తు పెట్టుకునే హక్కును నియంత్రించలేమని స్పష్టం చేసింది. ఇది ప్రజలు నిర్ణయించాల్సిన అంశమని తేల్చిచెప్పింది.
ఇదీ చూడండి: 'భారత్‌తో అత్యున్నత మైత్రీబంధమే లక్ష్యం'