ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో ఇద్దరు పూజారులు హత్యకు గురయ్యారు. పగౌణా గ్రామంలోని దేవాలయంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఏం జరిగింది?
"అనుప్షార్ ఠాణా పరిధిలోని పగౌణా గ్రామంలోని ఓ ఆలయంలో జగదీశ్(55), షేర్ సింగ్(45) పూజారులు. వీరిద్దరూ మంగళవారం ఉదయం గుడిలోనే శవాలై కనిపించారు. లాఠీ దెబ్బల కారణంగానే వారు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతదేహాల్ని గుర్తించే సమయానికి అదే ప్రాంతంలో ఓ యువకుడు గంజాయి మత్తులో, నగ్నంగా తిరుగుతూ కనిపించాడు. అతడ్ని అరెస్టు చేశాం.
సీనియర్ పోలీసు అధికారులు వచ్చి నిందితుడ్ని ప్రశ్నించారు. సోమవారం రాత్రి భంగ్ మత్తులో గుడికి వెళ్లి, లాఠీతో కొట్టి పూజారుల్ని చంపానని ఆ యువకుడు చెప్పాడు. పూజారులతో తనకు ఎలాంటి గొడవ జరగలేదని, దేవుడి ఆకాంక్షను మాత్రమే నెరవేర్చానని అన్నాడు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది.
మురారి అలియాస్ రాజు అనే వ్యక్తి ఆలయంతో తాము ఉపయోగించే సామగ్రిని దొంగిలించారని 2 రోజుల క్రితం పూజారులు ఆరోపించారు. ఆ వ్యవహారానికి, ఈ హత్యకు సంబంధం ఉందా అన్న కోణంలోనూ విచారిస్తున్నాం" అని తెలిపారు పోలీసులు.
ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ విమర్శలు..
జంట హత్యలపై రాజకీయం చెయ్యొద్దని హితవు పలికింది కాంగ్రెస్. "మహారాష్ట్ర పాల్ఘడ్లో ఇద్దరు పూజారుల హత్యకు రాజకీయ రంగు పులిమేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. బులంద్‌షహర్ విషయంలో అలా చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. హత్యలకు కారకులు ఎవరో, ఎంత మందిని అరెస్టు చేశారో యూపీ ప్రభుత్వం, భాజపా చెబుతాయని ఆశిస్తున్నాం" అని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
'రాజకీయం సరికాదు'
జంటహత్యలపై రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. నేరానికి కారణమేమిటో విశ్లేషించాలని సూచించారు.
యోగికి ఠాక్రే ఫోన్..
ఘటనపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే... సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. జంటహత్యలపై విచారం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర పాల్ఘడ్లో జరిగిన మూకదాడిపైనా ఇదే విధంగా యోగి... ఠాక్రేకు ఫోన్ చేయడం గమనార్హం.
ఇదీ చూడండి: వలస కష్టం: కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం