జమ్ము కశ్మీర్ రాజౌరీ జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన చొరబాటుదారులు రెచ్చిపోయారు. నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట భారత జవాన్లు తనిఖీలు నిర్వహిస్తుండగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్‌లోకి చొరబడే సమయంలో చొరబాటుదారులను ఖైరీ త్రయాత్ అడవిలో గుర్తించి సైనికులు నిలువరించినట్లు అధికారులు వెల్లడించారు.
"నౌషెరా సెక్టార్లో జరిగిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి."- లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్, సైన్యం అధికార ప్రతినిధి
ఉగ్రవాద కదలికలు ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో చొరబాటుదారులు కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు.