జమ్ము కశ్మీర్‌ను చైనాలో భాగంగా చూపించినందుకు ట్విట్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు నెటిజన్లు. ట్విట్టర్ చేసిన ఈ పొరపాటును గుర్తిస్తూ.. అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) ప్రతినిధి కాంచన్ గుప్త తొలుత ఓ ట్వీట్ చేశారు.
"అయితే ట్విట్టర్ ఇప్పుడు భౌగోళిక సరిహద్దులను పునర్నిర్మించి, జమ్ము కశ్మీర్‌ను చైనాలో భాగం చేయాలని నిర్ణయించిందన్నమాట. ఇది భారత చట్టాలను ఉల్లంఘించడం కాకపోతే ఇంకేమిటి? భారత పౌరులు చిన్న పొరపాట్లకే శిక్షలు అనుభవించారు. మరి అమెరికాకు చెందిన ఈ టెక్ కంపెనీ చట్టానికి అతీతమా? " అని కాంచన్ గుప్త టెలికాం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ వివాదంపై స్పందించిన చాలా మంది నెటిజన్లు కూడా ట్విట్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
'ట్విట్టర్ ప్రకారం లేహ్ చైనాలో భాగమన్నమాట' అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
వెంటనే స్పందించి ట్విట్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ట్విట్టర్లో కోరాడు ఓ నెటిజన్. సామాజిక మాధ్యమాలు తమ మూర్ఖత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన సమయమొచ్చిందని రాసుకొచ్చాడు.
'దయచేసి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ట్విట్టర్ ఇండియాపై చర్యలు తీసుకోండి. భారత సార్వభౌమత్వాన్ని వారు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ఈ తీవ్రమైన పొరపాటును కప్పిపుచ్చుకునే అవకాశం వారికి ఇవ్వకండి.' అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
ట్విట్టర్ వివరణ..
జమ్ము కశ్మీర్‌ను చైనాలో భాగంగా చూపడంలో.. తలెత్తిన సాంకేతిక సమస్య తమ దృష్టికి వచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది. జమ్ముకశ్మీర్ అంశంలో నెలకొన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకుని గౌరవిస్తామని స్పష్టంచేసింది. ఈ సమస్యను తమ సాంకేతిక నిపుణులు పరిష్కరించినట్లు వివరణ ఇచ్చింది.
ఇదీ చూడండి:ఈ వారంలోనే భారత్-చైనా 8వ దఫా సైనిక చర్చలు!