తులసి గౌడ.. ఈ పేరుతో కంటే 'ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్' అని పిలిస్తే ఎక్కువ మంది గుర్తుపడతారేమో..! అవును మరి, అడవి గురించి అంతర్జాలానికి సైతం అంతుచిక్కని విశేషాలెన్నో తులసమ్మ టకటకా చెప్పేస్తుంది. చెట్టు,పుట్టలతో ఆమెకున్న అనుబంధం అలాంటిది. అడవి కోసం ఆమె చేసిన పోరాటాలు.. పర్యావరణ పరిరక్షణపై అవగాహనా పాఠాలకు పద్మశ్రీ అవార్డు సైతం తులసిబామ్మకు దాసోహమైంది.
ప్రకృతి ప్రేమకు అవార్డులు..
కర్ణాటకలోని హోనాలి గ్రామంలో పూరి గుడిసెలో నివసిస్తుంది తులసమ్మ. హళక్కి గిరిజన తెగకు చెందిన ఆమెకు ప్రకృతి అంటే అపారమైన ప్రేమ. సమీప ప్రాంతాల్లో అడవుల నరికివేతపై తిరుగుబాటు చేసింది.. కోస్తా ప్రాంత అన్కోలాలో దాదాపు లక్షకుపైగా చెట్లను ఒంటి చేత్తో నాటేసింది ఈ వీర వనిత. అక్షరం ముక్క రాకపోయినా.. మొక్కలపై ఆమెకున్న అవగాహనతో శాస్త్రవేత్తలు సైతం నివ్వెరపోయేలా చేసింది. అటవీశాఖలో చిరు ఉద్యోగం పొందింది. ఈ ఏడాది జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు అందుకుంది తులసమ్మ.
పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషికి కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. ఆ తరువాత ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఆమెకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
అడవితో చెలిమి చెరగలేదు...
ఇప్పుడు తులసమ్మ వయసు 74 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందింది కానీ, అడవితో ఆమె మైత్రిని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ మొక్కలు నాటుతూ.. ఆనందాన్ని పొందుతోంది.
ఇదీ చదవండి:'జల క్రాంతి'తో కరవు నేలలో జల సిరులు