అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో నిర్మించిన భారీ స్టేడియంను భారత ప్రధానమంత్రి మోదీ, ట్రంప్ కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఇరువురు దేశాధినేతలు స్టేడియంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంపై అందరి దృష్టి నెలకొంది.
ప్రారంభం అనంతరం ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డుల్లోకెక్కనుంది. ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంగా పిలుస్తున్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం రెండో స్థానానికి పడిపోనుంది. మెల్బోర్న్ స్టేడియం సామర్థ్యం 1,00,024 కాగా... లక్షా పది వేల సామర్థ్యంతో మోటేరా స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ స్టేడియం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ స్టేడియాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షించనుంది.
దిగ్గజాల రికార్డుల నిలయం
ఈ ప్రాంతంలో ఇదివరకే క్రికెట్ స్టేడియం ఉండేది. ఇక్కడ ఉన్న పాత మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. ఆ మైదానంలో 49వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించే వీలుండేది. 1983లో ఈ మైదానంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఈ స్టేడియంలోనే... టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఇదే మైదానంలో తన టెస్ట్ కెరీర్‌లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు.
2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఆ తర్వాత స్టేడియంను మూసివేసి విస్తరణ పనులు చేపట్టారు. 2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 1,10,000 మంది కూర్చునేలా స్టేడియంను నిర్మిస్తున్నారు.