త్రిపురను స్వచ్ఛ, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1100 గ్రామాల్లోని మార్కెట్లలో చెత్తకుండీల ఏర్పాటు కోసం ఆయన ఆరు నెలల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
త్రిపురను పరిశుభ్రంగా ఉంచుతూ.. ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు అన్ని గ్రామాల అధినేతలు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు.
సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని.. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది భాజపా. నేటి నుంచి వారం రోజుల పాటు 'సేవా సప్తాహ్' పేరిట విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు దేవ్. విప్లవ్ కుమార్ దేవ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగానూ ఉన్నారు.