దేశంలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కేరళ మలప్పురంలోని క్లబ్ మిలాష్ మైదానంలో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్ ఫైనల్స్లో సీఏఏపై వినూత్నంగా నిరసన తెలిపారు ప్రేక్షకులు.
క్రీడాకారులు, వేలాది మంది ప్రేక్షకులు కలిసి ఒకేసారి నినాదాలు చేశారు. 'మోదీ సున్లో ఆజాదీ.. జూట్ బూట్సే ఆజాదీ' (ఓ మోదీ వినండి.. మాకు స్వాతంత్ర్యం కావాలి.. అబద్ధాల నుంచి విముక్తి కావాలి) అంటూ ప్రధానికి తమ నిరసనను తెలిపాడు ఓ క్రీడాకారుడు. అతనికి ప్రేక్షకులు తోడయ్యారు.
ఈ మ్యాచ్ చూడటానికి వేలాది మంది తరలివచ్చారు. మైదానం పూర్తిగా నిండిపోయింది. 'ఆజాదీ' నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. జాతీయ జెండా రంగుల్లో బెలూన్లను గాల్లోకి వదిలారు.
మరిన్ని విశేషాలు..
సిస్కో చీనీ బజార్ జట్టు.. రెండు గోల్స్ తేడాతో ఎఫ్‌సీ కునిల్లి జట్టును ఓడించి మ్యాచ్ గెలిచింది. గెలుపు ఎవరిదైతేనేం.. అంతా కలిసి బహుమతిగా వచ్చిన నగదును కిడ్నీ వ్యాధితో బాధపడేవారికి విరాళంగా ఇచ్చారు క్రీడాకారులు.
ఇదీ చదవండి:మూడు వేల మంది ఒకేసారి సంగీతం ఆలపిస్తే..?