పారా మిలటరీ బలగాల్లో ట్రాన్స్‌జెండర్లను అసిస్టెంట్ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. వారిని ఎంపిక చేసే అంశంపై వైఖరేంటో చెప్పాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది.
ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై కేంద్రం చాన్నాళ్ల నుంచి యోచిస్తోంది. వారి నియామకాల విధివిధానాలు ఎలా ఉండాలో చెప్పాలని సీఏపీఎఫ్‌లను తాజాగా కోరింది. 'రాయల్ బాడీగార్డులు ట్రాన్స్‌జెండర్లు, అత్యంత బలవంతులని మనం గుర్తుంచుకోవాలి. ఒక అధికారిగా ఉండేందుకు అవసరమైన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారెందుకు ఉండకూడదు?' అని ఓ ఐటీబీపీ అధికారి అన్నారు.
'1986-87లో మహిళలు బలగాల్లో చేరినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఒక వ్యక్తి శారీరకంగా బలంగా ఉంటే లింగభేదం అసలు సమస్యే కాదు. కాలం గడిచే కొద్దీ మనం ముందుకెళ్లాలి' అని కశ్మీర్ లోయలోని సీఆర్పీపీఎఫ్ అధికారి అభిప్రాయపడ్డారు. 'ఒకవేళ అర్హత సాధిస్తే వీరు అత్యంత ఎత్తైన సరిహద్దు ప్రదేశాలు, పశ్చిమ సరిహద్దుల్లోని పాకిస్థాన్ సైన్యంపై పోరాటాలకు నాయకత్వం వహించాలి. కశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరాటానికి నాయకత్వం వహించాలి' అని ఈశాన్య భారతంలోని మరో అధికారి పేర్కొన్నారు.
'ట్రాన్స్‌జెండర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వారికి ప్రత్యేకంగా నివాసం, స్నానపు గదులు అవసరం అవుతాయి. కొద్దిగా వివక్షను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఏదేమైనప్పటికీ ఇది ట్రాన్స్‌జెండర్లపై అపోహలు తొలగేందుకు ఓ సదవకాశం' అని ఓ అధికారి తెలిపారు.