ఈ ఏడాది చివరికల్లా దేశంలోని రైళ్లన్నీ నిశ్శబ్దంగా ప్రయాణించనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పవర్ కార్లకు బదులు.. ఓవర్‌హెడ్ విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించడమే ఇందుకు కారణం. పవర్ కార్ల వల్ల శబ్ధ కాలుష్యం అధికంగా ఉంటోంది.
ఉన్న రెండు పవర్కార్లలో ఒక దానికి ఎల్ఎస్ఎల్ఆర్డీ అనుసంధానంతో భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన 6 సీట్లు, చైర్ కారు ప్రయాణికుల కోసం అదనంగా 31 సీట్లను పొందుపరిచినట్లు అధికారులు వివరించారు.
ప్రస్తుతం ఉన్న పవర్ కార్లు.. 105 డెసిబల్ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. డిసెంబరులోపు ఈ శబ్దాన్ని పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా రైల్వే వ్యవస్థకు విద్యుత్తు వినియోగంలో 800 కోట్ల ఆదాయం సమకూరుతుందని.. వాయు, శబ్ద కాలుష్యాన్నీ తగ్గించవచ్చన్నారు.
ఈ కొత్త వ్యవస్థను "హెడ్-ఆన్ జనరేషన్" (హెచ్.ఓ.జీ) అంటారు. ప్రస్తుతం విద్యుత్తు వినియోగంలో యూనిట్‌కు 36 రూపాయలకుపైగా ఖర్చవుతోంది. ఇదే యూనిట్ హెచ్ఓజీతో రూ.6కే లభిస్తుంది. ఇప్పటికే 342 రైళ్లను హెచ్ఓజీగా మార్చేసింది రైల్వేశాఖ. ఈ ఏడాది చివరినాటికి మరో 284 రైళ్లను హెచ్ఓజీ గా మార్చనున్నట్లు అధికారులు వెల్లడించారు.