కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు రూపొందించామని ప్రభుత్వం చెబుతుండగా, అవన్నీ నిజంగా అమలయ్యేవేనా అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ దశలోనూ ప్రభుత్వం జోక్యం లేకపోతే తాము నష్టపోతామని అంటున్నారు. సందేహాలకు స్పష్టమైన సమాధానాలు లభించకపోవడం వల్లనే వారు పోరుబాటు పట్టారు.
పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులను కొత్త చట్టాలుగా నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఆదివారం రాజపత్రం జారీ చేసింది. దీంతో ఈ చట్టాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ ఈ చట్టాలను రాష్ట్ర గెజిట్లో నోటిఫై చేయడం ద్వారా అమల్లోకి తీసుకురావాలి. ఈ చట్టాల్లోని నిబంధనలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేరిస్తే వాటిని కూడా గెజిట్ నోటిఫికేషన్లో తెలపాలి. ఈ చట్టాల ప్రకారం రైతుల నుంచి పంటను కొన్న రోజే వ్యాపారి సొమ్ము చెల్లించాలి. ఒకవేళ ఆరోజు చెల్లించలేకపోతే 3 పనిదినాల్లో చెల్లిస్తానని రశీదులో వివరాలు రాసి రైతుకు ఇవ్వాలి. ఇలా చెల్లించకుండా ఏ విధంగానైనా మోసగిస్తే వ్యాపారికి గరిష్ఠంగా రూ.10లక్షల వరకూ జరిమానా విధించాలని వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం-2020 స్పష్టం చేసింది. ఈ చట్టాల ప్రకారం రైతుల నుంచి పంటను కొన్నప్పుడు ఎలాంటి మార్కెట్ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వ్యాపారులు పంటలను కొన్నప్పుడు వాటి విలువలో ఒక శాతం సొమ్మును వ్యవసాయ మార్కెట్లకు చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఈ రుసుం చెల్లించాల్సిన పని లేదు.