సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఇన్ని నెలలుగా సాగుతున్న రైతుల శాంతియుత నిరసనలు హింసాయుతంగా మారాయి. గణతంత్ర దినోత్సవం వేళ చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిర్దేశిత సమయం, నిర్దేశిత మార్గాలు, ఆచారించాల్సిన నిబంధనలను పక్కనపెట్టిన రైతులు.. మధ్య దిల్లీలో కదం తొక్కారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఈ పరిణామాలు ఇరువురి మధ్య ఘర్షణకు దారితీశాయి.
ఎర్రకోటపై రైతు జెండా..
నిర్దేశిత మార్గాన్ని పక్కనపెట్టిన వందలాదిమంది రైతులు.. ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. అనంతరం చారిత్రక కట్టడం మీద దేశ ప్రధాని ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ జెండాను ఎగురవేసే వేదికను ముట్టడించారు. అనంతరం పైకి ఎక్కి తమ జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇది జరిగిన కొద్దిసేపటికి పోలీసులు ఎర్రకోటకు చేరుకున్నారు. నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు.
బస్సు దగ్ధం..
మంగళవారం ఉదయం నుంచే దిల్లీ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింఘు, టిక్రి సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత నిర్ణీత సమయానికి ముందే సరిహద్దుల నుంచి రైతులు అన్నదాతలు ర్యాలీకి బయలుదేరారు. కొద్దిసేపటికి.. పలువురు తమ ట్రాక్టర్లతో నిర్దేశిత మార్గాల నుంచి తప్పించి మధ్య దిల్లీవైపు దూసుకెళ్లారు.

ఈ తరుణంలో దిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సందర్భంగా ఐటీఓ ప్రాంగణం ఓ యుద్ధభూమిని తలపించింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు రైతులు బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ రైతు మరణించాడు. పోలీసుల తూటా తగిలే అతడు చనిపోయాడని కర్షకులు చెబుతుండగా... ట్రాక్టర్ బోల్తాపడి, తలకు గాయమై మరణించాడని పోలీసులు అంటున్నారు.

అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. పోలీసులపైకి దూసుకెళ్లారు. పలువురు.. తమ ట్రాక్టర్లను వేగంగా నడిపి పోలీసు సిబ్బంది మీదకు తీసుకెళ్లి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు ఆందోళనకారులు బస్సును ధ్వంసం చేశారు.
నగ్లోయి చౌక్, ముఖుర్బా చౌక్, చింతామణి చౌక్ ప్రాంతాల్లోనూ అల్లర్లు చెలరేగాయి.

అంతర్జాల సేవలు నిలిపివేత..
నిరసనల నేపథ్యంలో దిల్లీలో రవాణా వ్యవస్థ ఇప్పటికే దెబ్బతింది. తాజాగా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు అధికారులు. సింఘు, టిక్రి, ఘాజిపుర్, ముఖుర్బా చౌక్, నగ్లోయ్ చౌక్ ప్రాంతాల్లో ఆర్ధరాత్రి 12గంటల వరకు అంతర్జాల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు.
'ఇది వారి పనే'
శాంతియుత నిరసనల్లో ఉద్రిక్తతలు సృష్టించినవారిని గుర్తించామని రైతు సంఘాల నేత రాకేశ్ వెల్లడించారు. వారందరూ రాజకీయ పార్టీలకు చెందినవారని ఆరోపించారు.
ఇదీ చూడండి:- నిరసనకారుల నుంచి పోలీసును కాపాడిన రైతులు