తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈ నెల 12న కార్ప్స్ కమాండర్ స్థాయిలో చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో పాటించాల్సిన వ్యూహాలను సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి మిలిటరీ, రాజకీయ వర్గాలు సమావేశమయ్యాయి.
ఈ సీఎస్జీ(చైనా స్టడీ గ్రూప్) సమావేశంలో తూర్పు లద్దాఖ్‌లో భద్రతా పరిస్థితులను కూడా సమీక్షించారు. దీనితో పాటు పలు కీలక విషయాలపై చర్చలు జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సీఎస్‌జీలో.. విదేశాంగమంత్రి జైశంకర్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, త్రిదళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు వివిధ దళాధిపతులు సభ్యులుగా ఉన్నారు.
భారత్-చైనా మధ్య చివరిసారిగా సెప్టెంబర్ 21న మిలిటరీ స్థాయిలో చర్చలు జరిగాయి. సున్నిత ప్రాంతాలకు బలగాలను తరలించవద్దని, ఏకపక్షంగా సరిహద్దును మార్చే ప్రయత్నం చేయకూడదని ఈ భేటీలో ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే ఈసారి జరగనున్న చర్చల్లో.. క్షేత్రస్థాయిలో మరింత స్థిరత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్చలు జరపనున్నారు.
ఇదీ చూడండి:- 'భారత సరిహద్దులో 60 వేల మంది చైనా సైనికులు'