2021లో జనాభా గణన నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. నిర్వహణ వ్యూహాలపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. 100 కోట్లకు పైగా జనాభా లెక్కింపులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్చించినట్లు సమాచారం.
జాతీయ జనాభా రిజిస్ట్రీ(ఎన్పీఆర్)కు సంబంధించిన రాష్ట్ర సమన్వయకర్తలు, డైరెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లెక్కింపు ప్రక్రియకు సిద్ధం చేయాల్సిన అంశాలపై రెండు రోజులపాటు చర్చించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే ఎలా పరిష్కరించాలో చర్చించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర అధికారులకు అందజేశారు.
మొబైల్ ద్వారా..
2021లో మొదటిసారిగా మొబైల్ ఫోన్ ద్వారా జనాభా లెక్కలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 2021 మార్చి 1 నుంచి లెక్కింపు ప్రారంభించనున్నారు. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మంచు కారణంగా ఆ ఏడాది అక్టోబర్ 1నుంచి ప్రారంభిస్తారు.
ఈ ప్రక్రియ మొత్తం 16 భాషల్లో జరుగుతుంది. ఇందుకోసం మొత్తం రూ.12 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
2020లోనే ఎన్పీఆర్
ప్రక్రియ ప్రారంభానికి ముందే 2020 సెప్టెంబర్లో జాతీయ జనాభా రిజిస్ట్రీని సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రీలో పేరు నమోదు కోసం ఒక ప్రాంతంలో కనీసంగా ఆరు నెలలుగా నివాసం ఉంటున్నవారు, లేదా రానున్న ఆరు నెలల పాటు నివాసం ఉండాలనుకునేవారిని పరిగణనలోకి తీసుకుంటారు.