నేటితో ముంబయి మారణహోమానికి 11 ఏళ్లు. ఈ నేపథ్యంలో బాధితులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని స్పష్టంచేశారు.
అరేబియా తీరంలోని పోలీస్ స్మారకం వద్ద మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నివాళులు అర్పించారు. పెద్దసంఖ్యలో స్మారకం వద్దకు ప్రజలు చేరుకుని నాటి మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
ఉపరాష్ట్రపతి నివాళి..
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముంబయి దాడి బాధితులకు శ్రద్ధాంజలి ఘటించారు. నాడు ఉగ్రవాదుల ఏరివేతలో పాలుపంచుకున్న సైనికుల ధైర్య సాహసాలను శ్లాఘించారు.
"2008 ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి నా శ్రద్ధాంజలి. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. మాతృభూమిని రక్షించేందుకు నాడు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో పాల్గొంటూ అమరులైన సైనికులకు నా జోహార్లు."
-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అమెరికా సంతాప సందేశం..
26/11 ఉగ్రదాడి బాధితులకు నివాళులు అర్పిస్తూ అగ్రరాజ్యం అమెరికా ప్రకటన విడుదల చేసింది. 11 ఏళ్ల క్రితం ఉగ్రవాదులు చేసిన పిరికి పంద చర్యల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారని అమెరికా హోంశాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ ఓర్టాగస్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ జరిగిందీ..
2008 నవంబర్ 26న ప్రారంభమైన ఈ దాడి నాలుగు రోజుల పాటు కొనసాగింది. పాక్ నుంచి సముద్ర మార్గం ద్వారా భారత్‌కు చేరుకున్న 10 మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులు ముంబయి ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, నారిమన్ పాయింట్, తాజ్ హోటల్, కామా ఆసుపత్రి, ఓబెరాయ్ హోటల్‌పై దాడికి దిగారు. పాశవికంగా జరిగిన ఈ దాడిలో 166మంది ప్రాణాలు కోల్పోయారు. 300మందికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) చేపట్టిన ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో చిక్కగా 2012లో అతడికి ఉరిశిక్ష విధించారు.
ఇదీ చూడండి: రాజ్యాంగ నిర్మాణంలో రాజేంద్రుడి పాత్ర ప్రత్యేకం