అరుణాచల్‌ప్రదేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యే తిరాంగ్ అబోహ్ను ఎన్ఎస్సీఎన్ (ఐఎమ్) ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడిలో తిరాంగ్, ఆయన కుమారుడు సహా మొత్తం 11 మంది మరణించారు.
ఎమ్మెల్యే వాహనశ్రేణి అసోం నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖోన్సాకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అరుణాచల్‌ప్రదేశ్ టిరాప్ జిల్లా బొగాపాని గ్రామం వద్ద ఉదయం 11 గంటల సమయంలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తిరాంగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
అరుణాచల్‌ప్రదేశ్ ఖోన్సా పశ్చిమ నియోజకవర్గం నుంచి 2014లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్-పీపీఏ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తిరాంగ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్పీపీ టికెట్‌పై గెలిచారు.
ప్రముఖుల దిగ్భ్రాంతి...
ఉగ్రదాడిని ఎన్పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరాంగ్ హత్యపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దోషుల్ని విడిచిపెట్టబోమని తేల్చిచెప్పారు.
తిరాంగ్ హత్యను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. ఈ దుశ్చర్యను ఈశాన్య భారతంలో శాంతికి విఘాతం కలిగించేందుకు జరిగిన ప్రయత్నంగా అభివర్ణించారు.
ఇదీ చూడండి: దిల్లీలో ఎన్డీఏ ముఖ్యనేతల సమావేశం