పౌరులు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలపై దృష్టి నిలపాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లయిన సందర్భంగా పార్లమెంట్ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు మోదీ.
రాజ్యాంగ పీఠిక 'భారత ప్రజలమైన మేము' అనే మాటతో ప్రారంభమౌతుందని.. అదే మన బలం, స్ఫూర్తి అని ఉద్ఘాటించారు ప్రధాని. హక్కులు, బాధ్యతల్లో సమతూకం ఉండాలని జాతిపిత మహాత్మాగాంధీ భావించేవారని గుర్తుచేశారు.
"ఇదే సెంట్రల్ హాల్లో అనేక పవిత్ర గొంతులు రాజ్యాంగంలోని అంశాలపై చర్చించాయి. మన స్వప్నాలు, సంకల్పాలపై నాడు చర్చ జరిగింది. ఒక రకంగా ఇది జ్ఞాననిలయం. భారత్‌లోని ప్రతిఒక్కరి కలలకు రూపం ఇచ్చేందుకు ఇక్కడ ప్రయత్నం జరిగింది. డా. రాజేంద్రప్రసాద్, డా. అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, పండిత్ నెహ్రూ సహా అనేకమంది ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యంతో ఈ రాజ్యాంగాన్ని మన చేతుల్లో పెట్టారు.భారత్ ఇన్నేళ్లలో కేవలం సవాళ్లను ఎదుర్కోవడమే కాదు... స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. రాజ్యాంగాన్ని రెండు మాటల్లో చెప్పాలంటే భారతీయులకు గౌరవం.. భారతీయుల ఐక్యత.
నేడు సమయం వచ్చింది. ప్రాథమిక హక్కులతో పాటు ఒక పౌరుడిగా మన కర్తవ్యాలు, బాధ్యతలను గురించి ఆలోచించాల్సి ఉంది. బాధ్యతలను నెరవేర్చకుండా హక్కులను రక్షించుకోలేం. హక్కులు, బాధ్యతల మధ్య ఒక సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని గాంధీ చాలా చక్కగా వివరించారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ మాటలను గుర్తు చేసుకోవాలి. 'మీ బాధ్యతలను మీరు సరైన విధంగా నిర్వర్తించండి' అని గాంధీ చెప్పారు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు..
రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ బాబూ రాజేంద్రప్రసాద్, ముసాయిదా కమిటీ బాధ్యుడు డా. బీఆర్ అంబేడ్కర్ సహా సంవిధాన నిర్మాణంలో పాలుపంచుకున్న సభ్యులపై మోదీ ప్రశంసలు కురిపించారు. నేటి వరకు అంబేడ్కర్ బతికుంటే భారత ప్రజాస్వామ్యం బలోపేతమైన విధానం, జరిగిన అభివృద్ధిని చూసి సంతోషించేవారన్నారు.
ముంబయి మృతులకు నివాళి..
26/11 ముంబయి మారణహోమంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు మోదీ. రాజ్యాంగ దినోత్సవం రోజే ఈ మారణకాండ జరగడం దురదృష్టకరమన్నారు.
ఇదీ చూడండి: పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు