దేశంలో 24 గంటల వ్యవధిలో 1,074 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఒక్కరోజులో ఇప్పటివరకు ఇదే అత్యధికమని తెలిపింది.
రికవరీ రేటు ప్రస్తుతం 27.52శాతంగా ఉన్నట్లు వెల్లడించారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11 వేల 706 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారని తెలిపారు.
భౌతికదూరం నిబంధనను సడలించే సమయంలో తగిన జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరముందని.. లేకుంటే వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు అగర్వాల్. అందుకే లాక్డౌన్ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా.. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తుపెట్టుకోవాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
''దేశంలో సంభవించిన ప్రతి మరణం ఆందోళన కలిగించే విషయమే. అందుకే కొవిడ్ చికిత్సపై మరింత లోతైన అవగాహన అవసరం. చికిత్స ఇంకా ఎంత బాగా చేయొచ్చో దృష్టిపెట్టాలి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొంతమేర సడలించారు. కేసులు నమోదైన చోట్ల వైరస్ కట్టడి చర్యలు పకడ్బందీగా చేపట్టాలి.''
-లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
దేశవ్యాప్తంగా జోన్ల వారీగా సడలింపులు ఇచ్చినట్లు తెలిపిన కేంద్రం.. ఎవరూ ఆకలితో ఇబ్బంది పడకుండా చూస్తామని పేర్కొంది. అందుకే రాయితీ ధరకు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది. పేదలు, వలసకూలీలకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ముందుకునడుస్తామని తెలిపారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీవాత్సవ.
ఫిర్యాదు చేయండి..
సరకు రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. డ్రైవర్లు, వాహనదారులు ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్ నంబర్ 1930ను కేటాయించినట్లు తెలిపింది.