సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను 'సరికొత్త ఆందోళన్ జీవులు' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించడంపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ మండిపడ్డారు. మరి దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్ కూడా ఆ కోవకే చెందుతారా? అని ప్రశ్నించారు.
హరియాణాలోని కురుక్షేత్ర గుంప్తల గర్హూ గ్రామంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తికాయత్ ప్రసంగించారు. రైతుల గురించి కేంద్రం తప్పుగా మాట్లడుతోందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించకుండా తికాయత్ విమర్శలు గుప్పించారు.
"రైతు ఉద్యమాలు చేసేవారిలో కొందరు విదేశీ శక్తులు, సరికొత్త ఆందోళన్ జీవులు ఉన్నారని పార్లమెంట్లో ఒకాయన అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ లాంటి వ్యక్తులు కూడా పరదేశీయులేనా? వాళ్లు కూడా కొత్త ఆందోళన్ జీవులేనా?"
-రాకేశ్ తికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేత
రైతు ఉద్యమంలో చనిపోయిన 150 మంది రైతులు విదేశీయులేనా? అని ప్రశ్నించారు తికాయత్. నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేంత వరకు తమ ఆందో ళనను విరమించమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మోదీ కంటతడి- ఆజాద్‌కు సెల్యూట్!