ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2 నెలలుగా ఆంక్షల నడుమ ఉన్న జమ్ము కశ్మీర్లో తొలిసారి ఉగ్రకలకలం రేగింది. ఒక్కరోజే మూడు వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు అలజడి సృష్టించారు. శ్రీనగర్‌లో సైనిక వాహన శ్రేణిపై గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. మరో రెండు చోట్ల ఎదురుకాల్పులు జరిగాయి.
రాంబన్‌లో ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు.
రాంబన్ జిల్లా బటోట్‌లో ఓ ప్రయాణికుల బస్సును అడ్డుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. డ్రైవర్ చాకచక్యంతో.. బస్సుకు ముప్పు తప్పగా భద్రతాదళాల అప్రమత్తతతో పారిపోయిన అయిదుగురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాగి, అక్కడి వారిని బందీలుగా చేసుకున్నారు. అనంతరం బలగాలపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీటుగా బదులిచ్చిన భద్రతా దళాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఇందులో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన కీలక ఉగ్రవాది హతమయ్యాడు. బందీలుగా ఉన్న వారిని కాపాడాయి. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందాడు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
గందెర్బాల్‌లో ముగ్గురు హతం
జమ్ముకశ్మీర్ గందెర్బాల్ జిల్లా త్రుమ్ఖాల్ ప్రాంతంలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులను అంతమొందించాయి బలగాలు.
శ్రీనగర్‌లోనూ సైనిక వాహన శ్రేణిపై గ్రనేడ్దాడికి ప్రయత్నించారు ఉగ్రవాదులు. ఈ ఘటన నుంచి సైనికులు త్రుటిలో తప్పించుకున్నారు.