శాసనసభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో దుశ్చర్యకు పాల్పడ్డారు కొందరు దుండగులు. స్వాభిమాన్ పక్ష పార్టీ అభ్యర్థి దేవేంద్ర భుయార్పై దాడి చేశారు. ఈ ఘటన అమరావతి జిల్లా మల్ఖెంద్లో జరిగింది.
భుయార్ తన అనుచరులతో వరుద్ నగరం వైపు వెళుతున్న క్రమంలో ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించారు. మల్ఖెంద్ రోడ్లో కారును అడ్డుకున్నారు. భుయార్‌ను, ఇతరుల్ని బయటకు లాగి దాడి చేశారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను కారుపై పోసి నిప్పుపెట్టారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
గాయపడిన భుయార్‌ను స్థానికులు, అనుచరులు.. సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆయన పనే...!
ప్రముఖ నాయకుడు రాజు శెట్టికి చెందిన స్వాభిమాన్ పక్ష పార్టీ తరఫున అమరావతిలోని మోర్షి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు భుయార్. ఇదే స్థానం నుంచి భాజపా తరఫున రాష్ట్ర మంత్రి అనిల్ బోండే బరిలో దిగారు.
దేవేంద్ర భుయార్.. కాంగ్రెస్-ఎన్సీపీకి మిత్రపక్షమైన స్వాభిమాన్ పక్ష తరఫున బరిలో దిగినందుకే ఆయనపై మంత్రి తరఫు వ్యక్తులు దాడి చేశారని ఆరోపించారు బాధితులు.
ఇదీ చూడండి: 'సెక్స్ సీడీ' కేసులో ముఖ్యమంత్రికి స్వల్ప ఊరట