మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గవర్నర్ల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి, పీజీ (ఎంఎస్/ఎండీ) విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు.. మూడు నెలల పాటు జిల్లా విభాగంలో శిక్షణ పొందడం తప్పనిసరి చేసింది.
పీజీ వైద్య విద్యార్థులకు 3,వ 4,వ 5వ సెమిస్టర్లలో.. ఏదైనా ఒక సెమిస్టర్లో డిస్ట్రిక్ రెసిడెన్స్ ప్రోగ్రామ్(డీఆర్పీ)ని తప్పనిసరి చేసినట్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2020-2021 విద్యాసంవత్సరం నుంచి డీఆర్పీ అమల్లోకి వస్తుందని పేర్కొంది. జిల్లా ఆరోగ్య విభాగ వ్యవస్థను విద్యార్థులు అవగతం చేసుకుని, సంపూర్ణ నైపుణ్యాలు గల వైద్యులుగా ఎదగాలన్నదే డీఆర్పీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.
కనీసం 100 పడకలు ఉన్న జిల్లా ఆసుపత్రుల్లోనే వైద్య విద్యార్థులు ప్రయోగాత్మక డీఆర్పీ శిక్షణ పొందాలని నిర్దేశించింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇందుకోసం జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో సురక్షితమైన, సౌకర్యాలు, వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
డీఆర్పీతో లాభం..
- డీఆర్పీ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఆసుపత్రుల్లో శిక్షణ పొందే సమయంలో.. ల్యాబ్ సేవలు, వైద్య పరీక్షలు నిర్వహించడం, ఫార్మా సేవలు, ఫోరెన్సిక్ సేవలు, సాధారణ వైద్య విధులు, ప్రజారోగ్య కార్యక్రమాలు నిర్వహించడం వంటి బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన వచ్చే అవకాశముంది.
- ఔట్ పేషెంట్ , ఇన్ పేషెంట్, అత్యవసర విభాగాల్లోని ఏ విభాగంలోనైనా భవిష్యత్తులో విధులు నిర్వహించగలగడం అలవాటవుతుంది.
- నైట్ షిఫ్టుల్లో వైద్య సేవలు అందించడానికి సిద్ధమవుతారు.
- ఆసుపత్రి పర్యవేక్షణ, కార్యనిర్వహణ వంటి బాధ్యతలు చేపట్టడం ఈ శిక్షణ కాలంలో విద్యార్థులు నేర్చుకునే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: మగబిడ్డ కోసం భార్య గర్భాన్ని కోసిన కిరాతకుడు