పాతికేళ్ల స్నేహానికి గౌరవం ఇవ్వని భాజపా... ఏదో ఒక రోజు ఎన్సీపీ నేత అజిత్ పవార్‌నూ వదిలేస్తుందని శివసేన జోస్యం చెప్పింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కమలదళంపై ఈమేరకు తీవ్ర విమర్శలు గుప్పించింది శివసేన.
"భాజపాకు మద్దతు ఇచ్చేందుకు పార్టీ కార్యాలయం నుంచి అజిత్ పవార్ దొంగతనంగా తీసుకెళ్లిన లేఖను గవర్నర్ అంగీకరించడం మోసానికి పరాకాష్ఠ. సిగ్గుచేటు అని పిలుస్తూ వ్యవస్థను అవమానించదలుచుకోలేదు. అధికారమే పరమావధి అని భావించేవారికి రోజులు దగ్గరపడ్డాయి. అయితే రాష్ట్ర ప్రజలు మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది. భాజపా మోసం చేసే కళ, దళారీ సంస్కృతి కారణంగా మహారాష్ట్ర రాజకీయ అస్థిరతతో బాధపడుతోంది"
-సామ్నా పత్రిక సంపాదకీయం సారాంశం
అజిత్ పవార్‌ను అరెస్టు చేయాలని అంతకుముందు ఫడణవీస్, ఆయన అనుచరులు భావించారని, అయితే ఇప్పుడు ఆయనకు అనుకూల నినాదాలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది శివసేన. భాజపా ప్రవర్తన కరుడుగట్టిన నేరస్థుడిలా ఉందని ఆరోపించింది. ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవడం అసాధ్యమని, ఆ ప్రయత్నం ఎద్దు నుంచి పాలు పితికినట్లే ఉంటుందని పేర్కొంది.
ఇదీ చూడండి: 'ఇది రాజకీయ ధీరుడికి X ఆధునిక చాణక్యుడికి మధ్య ఆట'