బంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అధికారం కోసం రాష్ట్రాన్ని గుజరాత్‌లా మార్చేందుకు బంగాలీలు, మైనార్టీలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బంగాల్లో నివసించేవారు బెంగాలీ భాష మాట్లాడటం నేర్చుకోవాల్సిందేనని స్పష్టంచేశారు మమత.
భాజపా నేత ముకుల్ రాయ్ ఇలాకా అయిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కంచ్రపారలో బహిరంగ సభలో ప్రసంగించారు మమత.
"బంగ్లా భాషను మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. మేము దిల్లీకి వెళ్లినప్పుడు హిందీ మాట్లాడతాం. పంజాబ్ వెళ్తే పంజాబీలో మాట్లాడాలి. అది నేను చేస్తాను. తమిళనాడు వెళ్లినప్పుడు... నాకు తమిళం రాదు. కానీ కొన్ని పదాలు తెలుసు. అదే విధంగా మీరు బంగాల్ వస్తే బెంగాలీలోనే మాట్లాడాలి. బయటి రాష్ట్రాల నుంచి వచ్చి బెంగాలీలపై దాడులు చేయటాన్ని మేము అనుమతించం.
ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా కొన్ని సీట్లు గెలిచినంత మాత్రాన బెంగాలీలు, మైనార్టీలపై దాడులు చేయాలనుకోవటం సరైంది కాదు. దానిని మేము క్షమించం. పోకిరీలపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. బంగాల్లో నివసిస్తున్న ఆడ, మగ ఎవరైనా బెంగాలీ భాషలో మాట్లాడాలి."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
బంగాలీలు, బంగాలీయేతరుల మధ్య భాజపా విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు దీదీ.
ఇదీ చూడండి: మహిళలకు ఉచిత ప్రయాణంపై 'మెట్రోమ్యాన్' గరం