సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంల సమస్య మళ్లీ పునరావృతమైంది. బిహార్, కేరళలో ఉదయం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించారు.
మూడో విడత పోలింగ్‌లో 64.66 శాతం ఓటింగ్ నమోదైంది. క్యూలైన్లో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించింది ఈసీ. పూర్తి పోలింగ్ శాతంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం
- అసోం: 71.47 %
- బిహార్: 54.91 %
- గోవా: 70.90 %
- గుజరాత్: 58.96 %
- జమ్ము కశ్మీర్: 13.61 %
- కర్ణాటక: 60.42 %
- కేరళ: 70.28 %
- మహారాష్ట్ర: 57.01 %
- ఒడిశా: 61.00 %
- త్రిపుర: 77.28 %
- ఉత్తరప్రదేశ్: 56.71%
- బంగాల్: 78.97 %
- ఛత్తీస్‌గఢ్: 64.68%
- దాద్రా అండ్ నాగర్ హవేలి: 71.43%
- దమణ్ దీవ్: 65.34 %
ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు..
దేశవ్యాప్తంగా ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అక్కడక్కడ ఘర్షణలు..
బంగాల్ ముర్షీదాబాద్ బాలిగ్రామ్ పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవపడ్డారు. ఓటేయటానికి క్యూలైన్లో ఉన్న ఓ వ్యక్తి మరణించారు.
దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లా బునియద్పూర్లో ఓ పోలింగ్ ఏజెంట్ తన ఇంటి వద్ద విగత జీవిగా పడి ఉన్నారు. ముర్షీదాబాద్ రాణిగంజ్ ప్రాంతంలో రెండు పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి బాంబు విసిరాడు.
కేరళలో ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు హఠాత్తుగా కుప్పకూలి మరణించారు. మరో వ్యక్తి ఓటు వేసి ఇంటికి చేరుకున్న తర్వాత కన్నుమూశాడు.
ఓటేసిన ప్రముఖులు...
ఈ విడతలో ప్రముఖ నేతలు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా గుజరాత్లో ఓటేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మలయాళ ప్రముఖ నటులు మోహన్ లాల్, మమ్ముట్టిలు ఓటేశారు. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'తీవ్రవాదులకు ఐఈడీ- మనకు ఓటర్ ఐడీ'