దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో శుక్రవారం నుంచి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన మూడో విడత ప్రారంభం కానుంది. ఈ సారి నవ యుగ, కొవిడ్ సంబంధిత నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు కేంద్రం గురువారం ప్రకటనలో తెలిపింది.
స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా పీఎంకేవీవై మూడో విడత కోసం 2020-21 ఏడాదికి గానూ రూ. 948.90 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది. దాదాపు 8 లక్షల మంది నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొంది.
ఈ పథకం మొదటి రెండు విడతల్లో నేర్చుకున్న విషయాల ఆధారంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన విధానాలను రూపొందించినట్లు కేంద్రం పేర్కొంది. నైపుణ్యం గల నిపుణులను అందించేందుకు 729 పీఎం కౌశల్ కేంద్రాలు, 200కు పైగా ఐటీఐలను శిక్షణా కేంద్రాలుగా ఎంచుకున్నట్లు వివరించింది.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, నవపారిశ్రామిక శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఈ మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ కూడా హాజరుకానున్నారు.