జాతీయ అర్హత పరీక్ష (నీట్)కు సన్నద్దమవుతున్న ముగ్గురు విద్యార్ధులు 24 గంటల్లో ఆత్మహత్యకు పాల్పడడం తమిళనాడులో తీవ్ర విషాదం నింపింది. ధర్మపురి, నమక్కల్, మదురై ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు శనివారం తమ ఇళ్లలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరంతా 19 నుంచి 21 ఏళ్ల వయసు వారే. వారిలో ఒక యువతి కూడా ఉంది.
నీట్ పరీక్షల ఒత్తిడే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అని పోలీసులు భావిస్తున్నారు. నీట్ రద్దు చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తోన్న తమిళనాడు విపక్షాలు.. తాజా ఘటనతో స్వరాన్ని మరింత పెంచాయి.
సంతాపం..
ఈ ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేసిన డీఎంకే అధినేత స్టాలిన్ నీట్ ఒక పరీక్షే కాదన్నారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని సూచించారు.
విద్యార్ధుల బలవన్మరణంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సంతాపం ప్రకటించారు.
వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన 'జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)'కు ముందురోజు విద్యార్థిని జ్యోతిశ్రీ దుర్గ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసింది. 'నీట్'కు ముగింపు పలకాలి. దీనికి ప్రత్యామ్నాయం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, మనో నిబ్బరం నింపడం మన కర్తవ్యం. దాన్ని మనం నెరవేరుద్దాం.
-కమల్ హాసన్, మక్కల్ నీధి మయ్యం పార్టీ అధినేత
ఇదీ చూడండి:మాతృభాషలో ప్రాథమిక విద్య తప్పనిసరి!