జమ్ముకశ్మీర్లో సోమవారం ఇద్దరు జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రమూకను వెంటాడి మరీ వేటాడుతున్నాయి భారత బలగాలు. లష్కరే తోయిబా పనేనని అనుమానిస్తున్న ఆ మూకలో మంగళవారం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
బారముల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులే లక్ష్యంగా సోమవారం దాడికి పాల్పడ్డాయి ఉగ్రమూకలు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఓ పోలీసు అధికారి వీరమరణం పొందారు. అయితే దాడి జరిగిన గంటల వ్యవధిలోనే ముష్కరులపై ఉక్కుపాదం మోపాయి భారత బలగాలు. ఉగ్రస్థావరాలను గుర్తించి.. లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కు చెందిన కమాండర్ సజాద్ హైదర్ సహా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. ఇదే నేపథ్యంలో మంగళవారం మరో ఉగ్రవాదిని హతమార్చాయి.
ఘటనాస్థలంలో ఆయుధాలు, మందు పాత్రలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. కేరీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందినట్లు ప్రకటించారు అధికారులు.
ఇదీ చదవండి: దాడి చేసిన కొద్ది గంటల్లోనే ఇద్దరు ముష్కరులు హతం