సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయింది. 8 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ నియోజకవర్గంలోని కుల్గాం జిల్లాలోనూ ఓటింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. భద్రతా కారణాల దృష్ట్యా అనంత్‌నాగ్‌కు 3 దశల్లో పోలింగ్ ఏర్పాటు చేసింది.
ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు.
71 స్థానాల్లో 12.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం లక్షా 37వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఈసీ. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
71 నియోజకవర్గాల నుంచి 943 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 98మంది మహిళలు.
కట్టుదిట్టమైన భద్రత
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించింది. 2 లక్షల 70 వేల మంది పారామిలటరీ బలగాలు, 20 లక్షల మంది వివిధ రాష్ట్రాల పోలీసులు, హోంగార్డులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
నాలుగో దశ పోలింగ్‌లో కొంత మంది ప్రముఖులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
పది శాతం స్థానాల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది.
ఏప్రిల్11వ తేదీన ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికలు...మే 19న ముగియనున్నాయి. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.