హక్కులు 'ప్రాథమికమైన'వని 'ఆంక్షలు' వాటంతటి ప్రధానమైనవి కాదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. అరెస్టు ముప్పు పొంచి ఉందని భావిస్తున్న వ్యక్తులకు ముందస్తు బెయిలు మంజూరుకు కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. ముందస్తు బెయిల్పై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ కోసం ఒక వ్యక్తికి నేర శిక్షా స్మృతిలోని 438 సెక్షన్ కింద కల్పిస్తున్న ఉపశమనానికి నిర్ధిష్ట కాలావధి లేదని, విచారణ ముగిసే వరకు బెయిలు వర్తిస్తుందని వివరించింది.
438 సెక్షన్ గురించి...
ధర్మాసనంలోని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్...మిగతా న్యాయమూర్తుల వాదనతో ఏకీభవిస్తూనే విడిగా 73పేజీల తీర్పును వెలువరించారు. 'పౌరుల హక్కులు ప్రాథమికమైనవి. ఇతర ఆంక్షలకన్నా అవి సర్వోత్క్రష్టమైనవి. స్వాతంత్ర్య ఉద్యమం నాటి సంఘటనను పరిశీలిస్తే నిరసన తెలిపే హక్కును ప్రజలు ఉపయోగించుకుంటున్న తరుణంలో నాటి పాలకులు నిరంకుశంగా అణచివేశారు. దీర్ఘకాలం జైల్లో పెట్టేశారు' అని చెప్పారు. అర్థవంతమైన దర్యాప్తుకోసం కాకుండా శక్తిమంతమైన వ్యక్తుల ప్రయోజనాల కోసం పౌరులపై వివాదాస్పద, దురుసు అరెస్టులకు దిగుతున్న నేపథ్యంలో 438 సెక్షన్ను తెచ్చారని జస్టిస్ భట్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: తారసపడిన నల్ల చిరుత... వీడియో వైరల్